30, డిసెంబర్ 2012, ఆదివారం

వినరో భాగ్యము విష్ణుకథ

రచన: అన్నమాచార్య




 
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ||


ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ |
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ |


వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ |
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ||


గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్ల విరియాయె విష్ణుకథ |
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము

వెల్లగొలిపె నీ విష్ణుకథ ||

28, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలుగుని బ్రతికించు కుందాం - 3

తెలుగుని బ్రతికించు కుందాం -3

        తెలుగుకు  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. ప్రసిధ్ధ శైవ క్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలుజిల్లా లోని శ్రీశైలం , పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం క్షేత్రాల మధ్య నున్న ప్రాంతాన్ని "త్రిలింగ" ప్రాంతమని పిలిచేవారు.ఈ త్రిలింగ పదం నుండే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయి అని అంటారు.
        ఈ  పదాలు క్రమం మారడం చూస్తే నాకు మా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వస్తోందండీ . మేము స్కూల్ నుండి ఇంటికి సిటీ బస్సు లో ప్రయాణం చేసేవాళ్ళం . మా ఏరియా బస్సు ఆఖరు స్టాప్ ని అప్పటికి మేము ఎప్పుడూ చూడలేదు. అక్కడికి ఎక్కినవాళ్లు టిక్కెట్టు అడిగే వాళ్ళ నోట్లో వినడమే ఆ పేరు." చీకటి పట్నం" పేరు వింతగా అనిపించేది మాకు.ఈ చీకటి పట్నం ఏమిటో అక్కడ అంత చీకటిగా వుంటుందేమో అనుకునే వాళ్ళం పిల్లలం అందరం. ఒకరోజు మేము మాట్లాడుకుంటుంటే విని ఒక ఆయన చెప్పారు అసలు విషయం . చీకటి పట్నం అసలు పేరు"శ్రీ కృష్ణ పట్నం " అని. అది పలకలేనివాళ్ళు దానిని వాడుకలో పాపం చీకటి పట్నం గా మార్చేశారని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.
         అలానే మన "త్రిలింగ దేశం" కూడా వాడుకలో " తెలుగు "గా  మరిందన్నమాట . ఒకటి మాత్రం ఆనందం, అది ఏమిటంటే శ్రీ కృష్ణ పట్నం , చీకటి పట్నం గా మారినట్టు మరీ మసిబారిన పేరులోకి మన తెలుగు పేరు దిగనందుకు.      
         సరే కానీ ఇంతకీ త్రిలింగ కాబట్టి ఇంకొక విషయం ఇందులో వుందండీ ఈ మూడు క్షేత్రాల మధ్య అంతే తెలుగు వారు కృష్ణ, గోదావరి నదులు మధ్య ఉన్న ప్రాంతంలో నివసించేవారని చెప్పొచ్చు. ఇది ఒక వాదన ఐతే ఇంకొకటి కూడా వుంది తెలుగుకు ఆ పేరు రావడానికి ఇంకో కారణం.      
        తమిళం, గోండీ భాషలలో తెలు, తెలి అంటే తెలుపు లేదా చక్కని అని అర్ధం వుందట , "౦" అంతే బహువచనంట. ఆ విధంగా చూస్తే చక్కని వారు , తెల్లని వారు అనే అర్ధం వచ్చేలా తెలింగ, తెలుంగు అనే పదాలు వచ్చాయని కూడా అంటారుట.
      ఈ పదాలకు విలువ ఇచ్చి ఐనా మనం చక్కని(మంచి) వారుగా  ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలి కదండీ .

23, డిసెంబర్ 2012, ఆదివారం

తెలుగుని బ్రతికించు కుందాం - 2

తెలుగుని బ్రతికించు కుందాం - ౨


భారత దేశం లో అతి ప్రాచీన భాషలలో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం  తెలుగు భాషకి  ౨౦౦౮ (2008)సంవత్సరంలో  ప్రాచీన భాష హోదాని ఇచ్చి గౌరవించింది . అదే సమయంలో సంస్కృతం , తమిళం. కన్నడ భాషలకు కూడా ప్రాచీన భాష హోదాని ప్రకటించింది.

తెలుగు వారు లేని దేశం కనిపించదంటే అతిశయోక్తి కాదేమో. ఈ రోజులలోతెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. మన దేశ జనాభాలో హింది, బెంగాలీ ల తరువాత ఎక్కువ మంది వుపయోగించే భాష తెలుగు అనే విషయం మనం గర్వించదగ్గ విషయం . అంటే మన తెలుగు భారత దేశంలో మూడవ స్థానంలో వుందన్న మాట. అలాగే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ౧౫(15) వ స్థానంలో వుందిట.ఐనా కూడా దీని విలువ మనం గ్రహించ లేకపోతున్నాం .

మన పిల్లలకు ఇంగ్లీషు నేర్పించడంలో ఉన్న శ్రద్ధ తెలుగు నేర్పడంలో పెట్టలేకపోతున్నాం. ఆలోచించండి. ఏమి  చేస్తే మన తెలుగుని తరువాతి తరాల వారు మర్చిపోకుండా చెయ్యగలమో మీ సలహాలను అభిప్రాయాలను  తప్పక సూచించగలరు .

నా సలహా ఐతే వారానికి ఒక చిన్న వ్యాసం తెలుగులో రాయడం పిల్లలకు అలవాటు చేస్తే వారికీ తెలుగు పట్ల అవగాహన పెరిగే అవకాశం వుంటుంది. మంచి కథలు మనం చదివి వారితో చదివించే అలవాటు చేస్తే కూడా బావుంటుందని నా ఉద్దేశ్యం.

మీరు ఏమంటారు? మరి ప్రయత్నించి చూద్దామా .

22, డిసెంబర్ 2012, శనివారం

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ



రచన: అన్నమాచార్య


కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||

20, డిసెంబర్ 2012, గురువారం

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు

ఈ కీర్తన నేర్చుకోవడం కొంచెం కష్టం అనుకుంటానండి.M.S. సుబ్బలక్ష్మి గారి గొంతులో ఎంత భక్తి భావమో . వింటుంటే మాత్రం ఆ వేంకటేశ్వరుడు ఎదురుగా వున్నట్టే వుంది . ఆవిడ అలా నిన్చోపెట్టారు మరి మనందరి కోసం .

రచన: అన్నమాచార్య


ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ||

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు |
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు |

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు |
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ||

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు |
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ||

19, డిసెంబర్ 2012, బుధవారం

అన్ని మంత్రములు నిందే ఆవహించెను

 
రచన: అన్నమాచార్య

అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ||

నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము |
కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ||

రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె
నంగ వింవె కృష్ణ మంత్ర మర్జునుండును |
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ||

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాధుండె గురి
పన్నిన దిదియె పర బ్రహ్మ మంత్రము |
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము ||

17, డిసెంబర్ 2012, సోమవారం

షోడసకళానిధికి షోడశోపచారములు

రచన: అన్నమాచార్య


షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ||

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మినిదే |
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ||

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే |
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ||

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము |
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ||

16, డిసెంబర్ 2012, ఆదివారం

13, డిసెంబర్ 2012, గురువారం

నారాయణతే నమో నమో

రచన: అన్నమాచార్య
రాగం: బేహాగ్
తాళం: ఆదితాళం


నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ||

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ |
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ||

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ |
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ||

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప |
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ||

12, డిసెంబర్ 2012, బుధవారం

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

రామ వర్మగారి త్యాగరాజ కీర్తన . ఈ పాట అందరికీ తెలిసినదే కానీ రామ వర్మగారి పారవశ్యంలో లీనమై వినండి (చూడండి) ఇంకా ఎక్కువగా ఆస్వాదిస్తారు .
రచన: త్యాగరాజ
రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము||

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము||

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ||గంధము||

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ||గంధము||

11, డిసెంబర్ 2012, మంగళవారం

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి

ఈ పాటే మధురం కదండీ.  కానీ  రామ వర్మ గారి గానం తో కలిపితే దాని మాధుర్యమే వేరు . ఆయన పాట పాడే విధానంలో ఏంతో భక్తి వుంటుంది . విని చూడండి 

రచన: అన్నమాచార్య

రాగం: కాంభోజి రాగం

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||

వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ||

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||

స్నేహం విలువ

            
                  స్నేహం విలువ ఎంత                     


                    స్నేహం ఈ పదం విలువ అందరికీ తెలియదని నా అభిప్రాయం. తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేని విషయాలు స్నేహితులవద్ద మనసు విప్పి చెప్పోచ్చంటారు . కానీ స్నేహితుడు/రాలు  అనుకునే వ్యక్తి కూడా అంత మంచిగా వుంటారనడానికి  నమ్మకం ఏమిటి? అందరూ ఆరోగ్యకరమైన ఆలోచనలతోనే వుంటారని ఎవరు చెప్పగలరు? స్నేహితులు అని మనం అనుకున్నట్టు అవతలి వారు వుంటారనటానికి దాఖలాలు లేవుగా. అదే వుంటే స్నేహం పేరుతొ ఈ రోజులలో ఇన్ని మోసాలు వుండవు. మరి ఈ విషయాన్నీ ఎవరు మనకు తెలియపరుస్తారు. 
       
                   ఒక వేళ ఎవరైనా  చాల గోప్యంగా వుంచవలసిన విషయాన్నీ స్నేహితుడు/రాలు  అని నమ్మి ఎవరికైనా చెబితే, ఆ హితునుకున్న వ్యక్తి ఆ విషయపు గాఢతను గ్రహించలేక దానిని బయటకు వెల్లడి చేస్తే  లేదా ............ఈ విషయంలో ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా వుండాలంటాను నేను. పిల్లలు , పెద్దలు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి స్నేహం వేరు, స్వవిషయాలు వేరు అని.

                   తల్లిదండ్రులని భగవంతుడు ఇస్తాడు. కానీ స్నేహితులను మనమే ఎంచుకుంటాం . సరయిన వ్యక్తిని ఎంచుకున్నామా లేదా అనేది ఎప్పటికీ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఒక సినిమాలో డైలాగ్ వుంది. బహుశా మీకు తెలిసే వుంటుంది . "అవకాశాన్ని బట్టి మంచివాడు చెడ్డవాడిగా మారొచ్చు , అవకాశం  లేకపోతే చెడ్డవాడు కూడా చేతకాక మంచివాడిగా మిగిలిపోవచ్చు".  అవకాశాలను గురించి  మనిషి ముందే వూహించడం అంత సాధ్యం కాదు కాబట్టి అందరినీ నమ్మి మన జీవితంలో చెడుని (చేదుని) కొని తెచ్చుకోవడం మంచిది కాదని అందరూ తెలుసుకుని మన జాగ్రత్తలో మనం వుండాలి అనే విషయాన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.

                   ఇప్పుడు పేపర్ల లోను , టీవీ లలోను చాలా మోసాల గురించి చదువుతున్నాము , వింటున్నాము. ఐనా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే వున్నాము. నెట్ స్నేహాలతో మోసాల గురించి కూడా అందరికీ తెలిసిన విషయాలే.ఇవి ఎవరనేది తెలియని వారి వల్ల మాత్రమే , తెలిసిన వారైతే  పరవాలేదు అనుకోవడం పొరపాటే అవుతుంది. కాబట్టి తెలిసిన వారైనా తెలియని వారైనా మన జాగ్రత్త గురించి మనం కొంచెం శ్రద్ధ తీసుకోవడంలో తప్పులేదు కదా . చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా మెలకువగా వుంటే మంచిది కదా. 

దీని ఉద్దేశం అందరిని అనుమనించాలని కాదు కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి.
            

                  

                



10, డిసెంబర్ 2012, సోమవారం

భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా |



రచన: అన్నమాచార్య కీర్తన 




 భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ||


కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానమ్ |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ ||


నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదమ్ |
తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలమ్ ||

9, డిసెంబర్ 2012, ఆదివారం

తిరువీథుల మెఱసీ దేవదేవుడు



రచన: అన్నమాచార్య



తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ||


తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద |
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ||


గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ||
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు ||


కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ||

7, డిసెంబర్ 2012, శుక్రవారం

అన్నమాచార్య కీర్తన




వింటూ నేర్చుకోవడానికి సులువుగా వుంది .ప్రయత్నించండి

రచన: అన్నమాచార్య




కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||

24, నవంబర్ 2012, శనివారం

స్వాతి ముత్యాలు

కొన్ని "స్వాతి ముత్యాలు"



మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మనిషి మనిషిగా జీవించడమే మహనీయత.

ఆడినమాట, గడిచిన కలం, వేసిన బాణం తిరిగిరానివి.
మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి.
ఉత్తమమైన స్వభావం అత్యున్నతమైన ఆభరణం.
మంచిపని ప్రతిదీ మొదట కష్టమనిపిస్తుంది.
చిన్న ఖర్చులే అని దుబారా చేయకండి. చిల్లు చిన్నదే అయినా పెద్ద ఓడ కూడా మునిగిపోతుంది.
ఆలోచించట మే కాదు, ఆచరణ ముఖ్యం – అదీ ఇప్పుడే ప్రారంభించాలి తప్ప రేపటికి వాయిదా వేయకూడదు.
మన అంతరాత్మయే మనకు మంచి స్నేహితుడు.
ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే రేపటిరోజుకు నవ్వుతూ ఆహ్వానించ గలుగుతాం.

17, నవంబర్ 2012, శనివారం

“స్వాతి” చినుకులు



“స్వాతి” చినుకులు


పని లోనే ఆనందించే వానికి ఫలితంపై ఆలోచన వుండదు.

తాము అనుసరించలేని మంచితనాన్ని చూసి ప్రతి వ్యక్తి భయపడతాడు.

హడావుడివల్ల ఎలాంటి లాభం వుండదు. ఇది వున్నవారు ఎప్పటికైనా నష్టపోతారు.

ప్రపంచం ఎలా వున్నా, నీవు నమ్మిన మంచి మార్గాన నీవు వెళ్ళు.

క్షణం సేపు కూడా భవిష్యత్ పట్ల విశ్వాసం కోల్పోవద్దు.

ఇతరుల విజయాలను మనస్పూర్తిగా అభినందించాలి.

ధర్మం వ్యక్తిని, సమాజాన్ని కూడా నియంత్రిస్తుంది.

నిజాయితీయే నిజమైన సంపద.

ఎంత ఉన్నతమైన పదవిని అలంకరిస్తే , అంత వినయంగా ఉండవలసివుంటుంది.

సమస్యను పెంచకు, ఆదిలోనే తుంచు.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

భావ సమతౌల్యం



భావ సమతౌల్యం

కోపంలో సమాధానం చెప్పకు 

సంతోషంలో వాగ్దానం చెయ్యకు

వత్తిడిలో నిర్ణయం తీసుకోకు

అవసరం లేనిచోట అబద్ధం చెప్పకు

అదే ఎమోషనల్ బ్యాలేన్సంటే 


చాలా మంచి మెసేజ్ కదా . ప్రతీ వాళ్ళు దీనిని కంఠస్తం చేస్తే చాలా  నేరాలు జరగవు. 

అలాగే చాలా మంది బిపి లాంటి రోగాలు రాకుండా కూల్ గా వుంటారు .

పిల్లలకు చిన్నప్పటి నుండి చెపితే కొట్లాటలు, గొడవల జోలికి వెళ్ళాక పోవచ్చు .

ఆడపిల్లలపై ఆసిడ్ దాడులు, హత్యలు, అత్యాచారాలు చాలా కంట్రోల్ అవుతాయి కదా.

ఇంకెందుకు ఆలస్యం పిల్లలలో ఈ  గుణాలు చొప్పించడాన్ని మొదలు పెడదామా?

10, అక్టోబర్ 2012, బుధవారం

కళ్ళు వెళ్ళిన చోటకల్ల మనసు వెళ్ళకూడదు



కళ్ళు వెళ్ళిన చోటకల్ల  మనసు వెళ్ళకూడదు , మనసు వెళ్ళిన చోటకల్ల  మనిషి వెళ్ళకూడదు

బాగుంది కదండీ లైన్ . ఈమధ్య TV లో శుభలగ్నం సినిమా వచ్చిందండి. అందులోదే ఈ డైలాగ్.
నిజం గానే ఈ రోజులలో ప్రతీ వ్యక్తి తప్పకుండా గుర్తు పెట్టుకోవలసిన డైలాగ్.

ఈ నాటి  యువత చాలా విధాలుగా ఎట్రాక్ట్ అవుతున్నారు . యువత దేమి వుందండి అటు 60వ పడిలో పడిన వారిలో కూడా ఇప్పటి రోజులు చాలా టెంప్ట్టింగ్ గా వున్నాయి కదండీ .
రక రకాల వ్యాపకాలు ఈ తరానికి అందుబాటులో వున్నాయి అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి .

చదువుకునే పిల్లలకు పక్కన ఫ్రెండ్స్ తో సినిమాలు , చేతిలో టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లు , ఫోనులో నెట్ ఫెసిలిటీలు ఎన్ని రకాలు బాబోయ్ అనిపిస్తోంది కదా .ఇంతాచేస్తే పిల్లల వయసు గట్టిగ 15 నిండకుండానే ఈ అవకాశం.

ఇంకా డిగ్రీ చేతికి రాదు ఇంతలోనే కాంపస్ సెలక్షన్లు, వేలకు వేల జీతాలు వయసు చూస్తే 20 నిండటం లేదు. అసలు ఆ వయసులో తప్పు ఒప్పు తేడ తెలుస్తుందా చెప్పండి. 

కానీ  దీని నిమిత్తం తల్లిదండ్రులే పిల్లలలో ఒక అవగాహనా ఏర్పరచాలి అనేది నా అభిప్రాయం . మీరేమంటారు?