22, సెప్టెంబర్ 2014, సోమవారం

గోవిందాశ్రిత గోకులబృందా అన్నమాచార్య




రచన: అన్నమాచార్య

గోవిందాశ్రిత గోకులబృందా |
పావన జయజయ పరమానంద ||


జగదభిరామ సహస్రనామ |
సుగుణధామ సంస్తుతనామ |
గగనశ్యామ ఘనరిపు భీమ |
అగణిత రఘువంశాంబుధి సోమ ||


జననుత చరణా శరణ్యు శరణా |
దనుజ హరణ లలిత స్వరణా |
అనఘ చరణాయత భూభరణా |
దినకర సన్నిభ దివ్యాభరణా ||


గరుడ తురంగా కారోత్తుంగా |
శరధి భంగా ఫణి శయనాంగా |
కరుణాపాంగా కమల సంగా |
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ||

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి అన్నమాచార్య కీర్తన







రచన: అన్నమాచార్య

రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి |
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ||


వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ |
తక్కినవి భాండారాన దాచి వుండనీ |
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము |
దిక్కై నన్నేలితి వీ  ఇక  నవి తీరని నా ధనమయ్యా ||


నా నాలికపైనుండి నానాసంకీర్తనలు |
పూని నాచే నిన్ను బొగడించితివి |
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ |
కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతేయయ్యా ||


యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని |
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను |
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ |
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ||