రచన: అన్నమాచార్య
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను |
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||
వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి |
కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ |
దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి |
జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి |
ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||
వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే |
కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె |
నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి