2, నవంబర్ 2016, బుధవారం

అభిరుచి

మొన్న బ్లాగ్ లో అందరు మా దంపతులకు ఒకటే అభిరుచి వుందని అన్నారు  అది చదివినప్పటినుండి నిజమేనా అని ఒకటే ఆలోచిస్తున్నాను .

ఆ ఆలోచనలు ఎక్కడ నుండి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తే మా పెళ్ళికి జాతకాలూ చూడలేదు మేనరికం కావడంతో . కానీ మా తమ్ముడి పెళ్ళిలో యేవో లెక్కలు అవి చూస్తున్నారు అప్పుడు నాకు మా వారికీ ఎన్ని అంకెలు కుదిరయా అని చూసనుకదా ఒక్క దానిలోనూ పొంతనలేదంటే నమ్మండి . అసలు బయటి (మేనరికం కాని ) సంబంధానికి మా జాతకాలూ చూడల్సివస్తే వెంటనే  సిద్ధాంతి గారు కూడా భయపడే సంబంధం మాది.

ఇంకా రుచులకి వస్తే పోద్దుటి నుండి మొదలు పెడదాం నేను కాఫీ చక్కగా చెట్టుకింద మెట్టుమీద కూర్చుని అది చల్లగా ఇపోతున్న నెమ్మదిగా తీరిగ్గా తాగాలి ఆయన వేడి వేడి టీ  పేపర్ లో ఒక వార్త చదవడం పూర్తయ్యే లోపు పొగలు కక్కుతూ తాగేయాలి.  ఇంకా టిఫిన్ లకి వస్తే నాకు వేడి తగ్గని టిఫిన్స్ ఇష్టం ఐతే తనకి పులిహోర ప్రాణం .
కూరలు చెప్పఖర్లేదు మా ఇద్దరి టేస్ట్ లు అస్సలు కుదరవు వాటిలో కూడా. ఇలా ఏది చూసినా ఇంత విరుద్ధంగా ఉన్న మమ్మల్ని, ఎలా ఒకటే అభిరుచి అనిపించిన్దబ్బా.

ఇక్కడితో ఇపోలేదన్దోయ్ ఇంకా చాల వున్నాయి మా బేధాభిప్రాయాలు .  పెళ్ళికి ముందు ఏడాదికి ఒక సినిమా ఐనా డౌట్ చూసే నేను వారానికి కనీసం నాలుగు సినిమాలు చూసే తను . బయట భోజనం అస్సలు తెలియని నేను, చాల మామూలుగా గా బయటి భోజనం తినే  తను . కొత్తవాళ్ళని పలకరించాలంటే భయపడే నేను అందరిని పరిచయం చేసేసుకునే తను . ఎవరింటికైనా వెళ్ళాలంటే మొహమాట పడే నేను అందరిని చుట్టేసి పలకరించేసే తను.  ఇన్ని తేడాలతో మేము ఒకే అభిరుచి ఏమిటో మీకూ తెలియటం లేదు కదా.

బంధువులలో, స్నేహితులలో మేము హిట్ పెయిర్ మరి.ఇప్పుడు శర్మగారి పుణ్యమా అని బ్లాగ్ లో కూడా. అందరిలోనే కాదండోయ్ మాకు కూడా అనిపిస్తుంది హిట్ పెయిర్ అని. ఎలాగబ్బా అని ఆలోచిస్తే మాత్రం దానికి కారణం మా ఇద్దరి స్నేహం అనే నేను చెపుతాను. ఎలాంటి టాపిక్ ఐనా తనతో షేర్ చేసుకునే స్వేచ్చని ఇచ్చారు నాకు అనే చెప్పాలి.  నచ్చింది నచ్చలేదు ఖచితంగా మొహమాటం లేకుండా మాట్లాడే అవకాశం ఇవ్వడం తన గొప్ప అనే చెప్పాలి.

చాల మంది భార్య అంటే అనుకూలవతిగా వుండాలి అంటారు కానీ మావారు సమాన హోదా లో నే ఉంచారు నన్ను. ఆ అవకాశం అందరు ఆడవాళ్ళకి వస్తుందనుకోను నేను, ఎందుకంటె అందరు మగవాళ్ళు ఒకలా మా వారిలా ఆలోచించరు కదా. మా వారి సన్మానపత్రంలా వుందనుకుంటున్నారా . తనతో ముఖాముఖి గా చెప్పలేం కదా ఇలాంటివి, అవకాశం వచ్చిందని చెప్పేస్తున్నాను అంతే, ఏం అనుకోకండి.

ఇంతకీ చెప్పోచేదేమంటే ఇన్నివిరుద్ధ భావాలూ,రుచులు వున్నామేము ఒకదానిలో మాత్రం ఒకలానే ఆలోచిస్తున్నాము సుమండీ .  అది ఒకరి మీద ఒకరికి గౌరవం , అభిమానం అని మాత్రం చెప్పాలి . మన పనితో  ఎదుటి వారు (ఒకరిని ఒకరు ) బాధ పడతారు  అనుకుంటే మాత్రం ఆ ఆలోచన ఆగిపోతుంది.  దానికి మూలం మా ఇద్దరి స్నేహమనే చెప్పాలి.

ఇంతకీ ఒక విషయం చెప్పాలి సుమండీ  ఇప్పుడు నేను మావారు చెప్పే వార్తలు వింటూ  టీ తాగుతున్నాను, పులిహోర తింటున్నాను, మూవీస్ చూస్తున్నాను.హోటల్ కి వెళ్తున్నాను . చుట్టాలతో క్లోజ్ గా మసులుతున్న , ఇంకా కొత్తవల్లంటే మాత్రం కొంచెం బెరుకు ఉందనుకోండి . ఇప్పుడు డౌట్ వస్తోందా మీకు ఆయన ఏం మారారు అని నాకు ఇంకా తెలియలేదు మరి తెలిస్తే చెపుతాను . మీరేమంటారు?


27, అక్టోబర్ 2016, గురువారం

ఆడది

 ఆడది

      ఆడపిల్లకు అసలు నిజంగా సొంతం అని ఎవరున్నట్టు?  అమ్మ నాన్నల దగ్గర మారం చేస్తే ఆడపిల్లవి ఏమిటా మారం అని పట్టించుకోరు. అమ్మ నాకూ  సైకిల్ కావాలి కోనవూ అని అంటే నీకేందుకు ఆడపిల్లవి అనేస్తుంది అమ్మ. అన్నని ఏదన్నా అడిగితే తన పనులు తనవంటాడు . పెళ్ళితో బాధ్యత తీర్చుకుంటాడు తండ్రి.

     ప్రేమించి / పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న భర్త చేయి పట్టుకోగానే నీ తరువాతే అన్నీఅని (మచ్చిక చేసుకోడానికి) మన ఇంట్లో చెప్పిన కబుర్లు అతని ఇంటికి తీసుకెళ్ళ గానే అమ్మ చెప్పింది చెయ్యి అనో , అక్కకు నచ్చినట్లు ఉండు అనో రెండో స్థానంలో నించో బెడతాయి .

     ఇంక పిల్లలు పుట్టకా చెప్పనే అవసరం లేదు. ఏనాటికైనా వీళ్ళకు నా తరువాతే అని మొదట అనిపించినా వారి అవసరాలతో ఆడదాని కాలం, జీవితం కరిగిపోతాయి. కొడుకు హయాముకు వచ్చేసరికి రెండో స్థానం నుండి జారి ఆఖరికి చివరి స్థానం ఐనా దక్కుతుందో లేదో చెప్పలేని ఆడ బ్రతుకుకు ఎవరు ఆసరా? ఎవరు ఆలంబన?

    వీటన్నింటి మధ్య చిన్నచిన్న ఆనందాల రూపంలో చిరుజల్లులు కురిసినట్టే కురిసి మాయమయ్యే ఆడదాని జీవితానికి ఎవరి నీడ సొంతం? ఎవరి ఆత్మీయత నిజం?

ఇప్పటి రోజులలో మీకు చదువులు , సంపాదనలు వున్నాయిగా అనేవారు వున్నారు. ఎన్ని చదువులు వున్నా , సంపాదనలు వున్నా పక్కన నిజమైన తోడూ నీడ వుండడం అవసరం .స్వతంత్రం వేరు స్వాంతన వేరు . ఆ తోడు ఎవరిది ?  ఆనీడ ఏది ?


20, అక్టోబర్ 2016, గురువారం

చెప్పాలని వుంది

చెప్పాలని వుంది నీకు చాలా చెప్పాలని వుంది
నీతో గడిపే ప్రతిక్షణం నా జీవిత మధురిమని
నీతోడే నా ఆనందాల వెల్లువని
నీ చెలిమే నా గరిమ అని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!

నాపై నిలిచే  నీ చూపే నా చిరకాల వాంఛ అని
నీ నోటి మాటే నా జీవిత మకరందమని
నీ చేతి స్పర్శే నా జన్మకు ధన్యమని
నీ అభిమానమే నా జీవిత లక్ష్యమని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!

నీతో వేసే ప్రతి అడుగు నా గమ్యానికి చేరువని
నీతో పలికే ప్రతి మాట నా ప్రగతికి మెట్టు అని
నీతో ఆడే ప్రతి ఆట నా ఆనందానికి ఆసరా అని
నీతో నిండిన జీవితమే నా జన్మకు పరమార్ధమని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!


15, అక్టోబర్ 2016, శనివారం

పాత కొత్తల మేళవింపు


మీరు పాత కొత్తల మేళవింపు గురించి విని వుంటారు కదా . ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా . ఏమిటి చాల రోజుల తరువాత కాదు కాదు చాల ఏళ్ళ తరువాత వచ్చి ఇలా ఏమిటేమిటో అడుగుతోంది తల తోక లేకుండా అనుకుంటున్నారా .. కాసేపు ఆలోచించండి చూసారో లేదో . ఎందుకంటె మేము మొన్న దసరా సెలవలకి మా ఊరు వెళ్ళినప్పుడు ఒక పెద్దాయన్ని చూడడానికి అనపర్తి వెళ్ళాము . ఆయన మీ అందరికి కూడా పరిచయమే లెండి మీ అందరికి అంటే బ్లాగ్ లు చదివే వారందరికి అని సుమండీ .

ఇంటిముందు గేటు తీసేసరికి చక్కగా అరటి మొక్కలు, కనకాంబరాలు, మామిడి చెట్టు, మల్లె తీగ ఇలా అన్ని మొక్కలు స్వాగతం పలికాయి . ఎదురుగా పెద్దావిడా (పార్వతిదేవి అంటే బాగుంటుందేమో )ఎవరికో అరటి ఆకులు ఇస్తూ మమ్మల్ని చూసి ఎవరబ్బా ఎక్కడ చూసినవాళ్ళలా లేరే అనుకుంటూ ఉండగానే మేము హైదరాబాదు నుండి  వచ్చాము సర్ వున్నారా  అండి  అని  అడిగాము.  ఆవిడ లోపలి  తీసుకు వెళ్లారు మీకోసం ఎవరో వచ్చారు అంటూ .

చక్కగా కచ్చాపోసిన  పంచెకట్టు ముఖాన విభూది రేఖలు , వాటి మధ్యన కుంకుమ  బొట్టు. అప్పుడే భోజనం ముగించుకుని ఒక్కపొడి నములుతున్న 6 అడుగుల 70వ పడిలో పడిన మనిషిని చూసి మేము ఫలానా మిమ్మల్ని చూడాలని వచ్చాము అని మావారు తన పేరు ఊరు పరిచయం చేసుకున్నారు . ఆ పరిచయం తో మావారిని పెద్దాయన పరిష్వంగం తో సత్కారం చేసారు . ముఖం తెలియక పోయినా ఆ సత్కారానికి మా వారు తెగ సంబరపడిపోయారు. ఆయన ఆనందాన్ని నేను పంచుకున్నాను అనుకోండి .

ఇంతకీ మొదలు పెట్టిన విషయానికి దీనికి ఏమిటా సంబంధం అనుకుంటున్నారు కదా . వస్తున్నానండి అక్కడికే వస్తున్నా .ఇంతకీ ఆ పెద్దాయన వేషధారణ గురించి చెప్పానుకదా ఆయన వయసుకు భోజనం తరువాత ఏంచేస్తారు కాసేపు పడుకుంటారు అనుకుంటాము మనం కానీ ఆయన ఈ నాటి కంపూటర్లు మాకేం గొప్పకాదు అనేలా కంప్యూటర్ లో తెలియని విషయం లేదు . పూర్వకాలంలాగా అంటే మరీ 60 లు 70 లు లోలా కాదు 80 లో లా లెండి మోడల్ ఇల్లు వంటగది వేరు భోజనాల గది వేరు డైనింగ్ టేబుల్ వుందండోయ్. అలానే పెద్దగ హాలంతా నిండిపోయే టీవీ కాదు కానీ చక్కగా ఎవరి పడక గదుల్లో వాళ్ళకి చిన్న టీవీలు . పెరటిలో చక్కని మొక్కలు ఇంట్లో ACలు , అలానే మీకు నీళ్ళకు కాగులు వాడేవారు గుర్తుందోలేదో మా అమ్మమ్మగారి ఇంట్లో మా మామ్మగారి ఇంట్లో ఉండేవి లెండి పెద్ద ఇత్తడి బిందెతో కట్టెలపొయ్య మీద వేడి నీళ్ళు కాస్తారు దానిని కాగు అంటాము మేము.పెరటిలో కాగు తో నీళ్ళు కచుకోడానికికట్టెల పొయ్యి ఇప్పుడు చెప్పేది మరీ వింత గొప్ప కూడానండోయ్ మీరు ఊర్హించలేరు పాతకాలం వాళ్ళు అందులోను పల్లెటూరి వాళ్ళు దానిగురించి ఆలోచిస్తారని చెప్పేస్తున్నా మరి సోలార్ పవర్ సప్లై. అది చూసి నేను చాల ఆశ్చర్యపోయాను సుమండీ.

సిటీ లో వాళ్ళే దాని గురించి ఆలోచించడం చాల అరుదు కదా . అలాంటిది చిన్న ఊరిలో ఆ సోలార్ వాడకం నాకు చాల కొత్తగా అనిపించింది . అప్పుడు అనిపించింది  ఆ పెద్దాయన కు అన్నింటిమీదా పట్టు వుంది కనుకనే ఇన్ని పోస్ట్లు, బ్లాగ్స్ లో అన్ని కంమెంట్లు అంతమంది  ఫాల్లోవర్స్ అని . ఆయన అనుభవం ఆధ్యాత్మికం ఆసక్తి ఎప్పుడు కాలంతో పాటు నడుస్తూ ఉంటాయని అర్ధమయ్యాక ఆయనమీద అభిమానం మావారికి నాకు చాల పెరిగిపోయయనుకోండి .

అన్నట్టు ఇంకో విషయం కూడా చెప్పాలి,  ఇంట్లో ఆయన భార్య కొడుకు కోడలు ఒక మనవరాలు వున్నారు . చిన్న ఊరులో ఆడపిల్లని పెంచడం అంటే ఇక్కడ వంచిన తల బడిలోనూ, బడిలోవంచిన తల ఇంట్లోను ఎత్తేలా పెంచుతారు కదా. అందులోను తాతగారు  మామ్మగారు వున్నా ఇంట్లో ఆడపిల్ల అంటే ఇంకా కట్టుబాట్లు ఎక్కువ వుంటాయి కదా, ఇంతకీ విషయమా ఏంటంటే ఆ మనవరాలు నేషనల్ లెవెల్  కరాటే ఛాంపియన్ అంటే ఆశ్చర్యంగా లేదు మీకు.

పాత ఆచారాలను ఒక చేతిలో పట్టుకుని, కొత్త ఆలోచనలను మేళ విన్చుకుంటూ, తన తరువాతి తరానికి ప్రతి విషయాన్నీ విపులంగా వివరిస్తూ, వాటిలోని మంచి చెడులను ఎంచుకోగలిగిన ఆలోచనలను వారిలో పెంపొందిస్తు ముందుకు నడిపిస్తూ, ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా దేశవిదేశాలలోని పాఠకులకు కూడా  ఆ విజ్ఞానాన్ని పంచుతూ, వారికి  వున్న సమయాన్ని అందరికి ఉపయోగపడేలా వినియోగిస్తున్నారంటే చాల ఆనందంగా వుంది  కదూ . రేపు కాదు కాదు ఇప్పటినుండైనా మనం ఎలా ప్రవర్తిస్తే నలుగురికి మన నుంచి మంచి అందే అవకాశం ఎలా వుంటుందో మనకు తెలుస్తుంది ఇలాంటివారి సావాసం వల్ల. వారికి నా నమోవాకాలు.