జర్నీ (ప్రయాణంలో పదనిసలు)
జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయతీయగా జోరుగా.....
ఈ పాట వింటూ కారులో లాంగ్ జర్నీ ఎంత బాగుంటుందో కదా. మేము ఈ హాయినీ , తీయదనాన్ని చాలా సార్లే ఎంజాయ్ చేసాము లెండి . కానీ దారిలో ఏదైనా ఇబ్బంది అయిందంటే వచ్చే చేదుని కూడా ఈ మధ్యనే రుచి చూసాము మేము. ఎలా అంటారా...
మొన్న వినాయకచవితికి రెండు రోజులముందు బెంగుళూరుకు వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభిస్తే నేనేమో హాయిగా ట్రైన్లో వెళదాం అని అంటే మా సుపుత్రుడు ససేమిరా అని, వెడితే కారులో హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళదాము అని ఒకటే పట్టుపట్టాడు. నా ఓటు తప్ప, వాడిది కాక, ఇంట్లో మిగిలిన రెండు ఓట్లు వాడికే పడ్డాయి. ఇంకేముంది నేనుకూడా తప్పని పరిస్థితుల్లో సరే అని దానికే ఊ అనాల్సివచ్చి కారులో బయలుదేరాము . NH 7 హైవే చాలా బాగుంది. నిజంగానే చాలా హాయిగా సాగిపోయాము చీకటి పడేదాకా .
చీకటి పడ్డాకా దారిలో మా కారుకి ఏదో తగిలి ధబీ మని పెద్ద సౌండ్ . మావారు గభాలున కారు పక్కకి ఆపి చూసాముకదా పెట్రోల ట్యాంక్ కు హోల్ అయ్యింది. బొటబొటబోట మని ఇరవై లీటర్లు పైగా పెట్రోల్ ఒక్కసారిగా మా కళ్ళముందే నేలపాలయిపోయింది . అసలే ఈ రోజులలో పెట్రోలంటే మాటలా. అందులోను డబ్బుల బాధ కన్నా చూస్తూ చూస్తూ అంత ఫ్యూయల్ ని నేలపాలవుతుంటే చూడడం ఇంకా బాధ. ఏమి చేయలేము దానిని ఆపడానికి .
ఇంతకీ ఏమి తగిలిందా అని కొంచెం వెనక్కి నడిచి వెళ్లి చూస్తే పోలీసులు స్పీడ్ కంట్రోల్ కోసం పెట్టె బోర్డు. ఎవరో లారీవాళ్ళో , వేరే వాళ్ళో దానిని అంతకు ముందు గుద్దేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన దాని ఫలితం మేము ఇబ్బంది పడడం . కొంచెం ఆగి దానిని పక్కకి జరిపితే వాడి సొమ్మేంపోతుంది చెప్పండి. ఇంకా అది అక్కడే అలానే వుంటే మాలానే వేరేవాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వుంటుందని పాపం మా వారు దానిని పక్కకి పెట్టి వచ్చారనుకోండి . ఇలాంటి విషయాలలో మాత్రం నేను మావారిని మెచ్చుకోక తప్పదనుకోండి. ఏమి చేస్తాం తను గుడ్ బోయ్ మరి. మీరు ఆయనతో నేను ఇలా అన్నానని చెప్పకండి. ఇంక ఆయన ములగచెట్టు దిగరు. మనం పట్టుకోలేము .
ఇది ఒక ఎత్తయితే టైం ఎంత అని చూసేసరికి రాత్రి ఒంటిగంట . అప్పుడు మొదలయ్యింది నాలో కంగారు. అర్ధరాత్రి, హైవే , నిర్జనప్రదేశం , వంటిమీద బంగారం, పక్కన ఆడపిల్ల . ఎవరినైనా ఆపి హెల్ప్ అడగలన్నా భయం. ఆడపిల్ల పుట్టిందని ప్రతిక్షణం మురిసిపోయే నేను మొదటిసారిగా ఆడపిల్ల అంటే భయపడడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది . మనం మన దేశంలోనే వుండి బ్రతకడానికి ఇంత భయపడవలసిన పరిస్తితి ఏమిటా అని. కానీ అవసరం వుండి కూడా డేర్ చేసి బయటికి మన పని మీద మనం వెళ్లడానికి వీలు కాని పరిస్తితికి కారణం ఎవరు అని ఆలోచిస్తే సమాధానం మాత్రం కేవలం మనమే అనేది మాత్రమే దొరుకుతోంది . బహుశా మీ అందరికి కూడా అదే సమాధానం దొరుకుతూ ఉండో చ్చేమో .
లోపల కారులోనే ఉండు అని చెపితే అర్ధంకాక , నాన్న వెనక క్యూరియస్ గా తిరిగే చురుకైన ,అమాయకపు చిన్నపిల్ల తను. అంత భయపడకోయ్ అనే అసలు భయం పట్టని మావారు. ఇంక నా కొడుకైతే సరేసరి . ఫరలేదులే అమ్మా నేను , డాడీలేము అంటాడు వాడు . నా పాట్లు ఆ దేవుడికే తెలియాలి.
ఇంతలో మా వారు హై వే పోలీసులకు ఫోన్ చేసి ఏదన్నా హెల్ప్ దొరుకుతుందేమో అని చూసారు. వాళ్ళు ఆక్సిడెంట్ అయ్యి ఇంక గొడవ జరుగుతూ ఉంటేనే వస్తారుట లేకపోతే రారుట. అలాగే హై వే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేస్తే మొత్తానికి బండి తుక్కుతుక్కు అయిపోతే పక్కకి పడేయడానికి వస్తారుట అదేట వాళ్ళ డ్యూటీ .పోనిలే బాబూ అంత అవసరం రాకుండా భగవంతుడు దయ తలచాడు అని అనుకోవలసి వచ్చింది వాళ్ళ సమాధానాలు విన్నాక.
ఒక గంటా గంటన్నర ఇలా గడిచాకా రిపేర్ షాప్లు కూడా పొద్దుటిదాకా తెరవరు కనుక మీరు బస్సులో బెంగుళూరు వెళ్ళిపొండి నేను రేపు రిపేర్ చేయించుకుని వచ్చేస్తాను అని మావారు అనగానే నాకు ఇంకా భయం వేసింది. ఎందుకా అని అనుకుంటున్నారా? ఏమి లేదండి నాకు పుట్టింటికి వెళ్ళడానికి ఇక్కడ ఈయన ట్రైన్ ఎక్కిస్తే అక్కడ (ఉండేది ఒక్క బస్సు స్టాప్ , ఒక్క రైల్వే స్టేషనే కాబట్టి) నాన్నగారు వచ్చి రిసీవ్ చేసుకోవడమే తెలుసు మరి. వేరే ఎక్కడికి నేను ఒక్కత్తినే వెళ్ళిన అలవాటు, ఆలోచన కూడా లేని దాన్ని మరి. నిజమండి.
అలాంటిది బెంగుళూరు అంటే మాటలా, ఎన్ని ఏరియాలో , ఎన్ని రైల్వే స్టేషన్లో, ఎన్ని బస్సు స్టాప్లో . వెళ్ళగలిగితే అక్కడికి మా తమ్ముడు వస్తాడనుకోండి, కానీ నా భయం నాది. ఎంతైనా సొంత ప్రాణం కదండీ . నా వల్ల కాదంటే కాదని ససేమిరా అనేసా.
ఇంక తప్పేది లేక మావారు కనీసం హైదరాబాదు బస్సు ఎక్కు నేకు తెలియకపోతే పిల్లలకకి తెలుసు అనేసారు. నా అభిప్రాయంతో పని లేకుండా. మా అబ్బాయి కూడా భరోసా ఇవ్వడంతో కొంచే భయంగానే అనిపించినా కూడా రోడ్డుమీద ఆడపిల్లతో రిస్క్ తీసుకోవడం కన్నా అదే మంచిదని హైదరాబాదు వెళ్ళే బస్సు రిక్వెస్ట్ మీద అక్కడే ఆపి ఎక్కి హైదరాబాదు చేరడం జరిగింది. బస్సు లక్డీకాపూల్ ట అక్కడ ఆగింది . అక్కడ ఆటో ఎక్కించాడు మా అబ్బాయి. ఒక్కదారి ఎప్పుడూ చూసిన దాఖలా కనిపించలేదు నాకు . నీకు దారి తెలుసురా అంటే వాడు పరవాలేదు అంటాడే కానీ గారెంటీ ఇవ్వడు. ఆటో డ్రైవర్ ఎటు వెళ్ళాలండి అని అడిగితె ఏమి చెప్పాలా అని నాకు ఒకటే టెన్షన్. నా అదృష్టం బాగుండి ఆ ఆటో డ్రైవర్ ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండానే మా ఏరియాకు తీసుకువచ్చాడు కాబట్టి సరిపోయింది. తెలిసిన ఏరియాకు వచ్చాకా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను నేను. ఇల్లు చూసాక అయితే ప్రాణం లేచొచ్చిం దంటే నమ్మండి. మా వారు రావడనికయితే పాపం రాత్రి అయ్యింది. (ఆయన కారుని ఎలా రిపైర్ చేయించుకున్నారు అనేది ఒక పోస్ట్ కు సరిపడే విషయం).
ఇంత టెన్షన్ , భయం ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మన అనుభవిస్తున్నాం అంటే మన సమాజం ఎంత ఇన్సేక్యుర్ గా తయారయ్యిందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. దానిని సరిదిద్దుకోవలసిన అవసరం దేశ పౌరులందరి మీదా వుంది. మనం తప్పుడు పద్దతులను ప్రోత్సహించకూడదు, చూసి చూడనట్లు ఊరుకోకూడదు, తప్పును తప్పు అని చెప్పడానికి సమిష్టిగా కృషి చేయవలసి వుంది. అనే నిజాలను అందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు మన దేశ పరిస్తితులను బట్టి ఎంతైనా ఉంది.
పక్క మనిషిని నమ్మలేని పరిస్తితి మన భారత దేశంలో వుంది అంటే మిగతా ప్రపంచానికి మన దేశానికి తేడా లేదనే కదా.
ఇంతకీ ఇదండి మా హాయి హాయి జర్నీ లోని చెడు అనుభవం. సో జర్నీ లో జాగ్రత్త సుమండి . తప్పు మనది కాకపోయినా ఒక్కొక్క సారి మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. అలా అని మానేసి ఇంట్లో కూర్చోలేముకదా. మీ ప్రయాణాలు ఎప్పుడూ తియ్యగానే సాగిపోవాలని కోరుతూ...............
శారద విభావరి
అంతా బావుంది కానండి , ఎంత పిల్లలు అడిగితేమాత్రం అర్ధరాత్రి highway ప్రయాణం ఎలా పెట్టుకున్నారండి..? .కీడెంచి మేలెంచమన్నారుకదండి....take care anyways...
రిప్లయితొలగించండి