25, సెప్టెంబర్ 2013, బుధవారం

ఎదురుచూపులు



                                       ఎదురుచూపులు

ఇలా శ్రీవారు ఆఫీసుకి వెళ్ళారో లేదో సుమన ఫోన్ వచ్చింది . ఇంట్లోనే ఉంటున్నావా నేను వస్తున్నాను అని.  You are always welcome అని చెప్పాను తనకి.  సుమన వస్తుందంటే నాకు చాలా సంతోషం మరి. ఎందుకంటే తను నాకున్న మంచి స్నేహితురాళ్ళలో మొదటి స్థానంలో వుంటుంది మరి.

తను వచ్చేసరికి పనంతా ముగించుకుని కబుర్లు చెప్పుకోవచ్చని మొత్తం పనంతా గబగబా హడావిడిగా చేసి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని తనకోసం ఎదురు చూస్తూ TV లో channels తిప్పుతున్నాను .  Time  చూస్తే 11.30, అయినా సుమన ఇంకా రాలేదు సరికదా, కనీసం తన ఫోన్ కూడా రాలేదు. సరేలే ఇంకా బయలుదేరటం కుదరలేదేమో అని అనుకున్నాను.

సుమనకి నాకు పదిహేనేళ్ళ స్నేహం. సుమన భర్త మావారు ఒకే ఆఫీసులో పని చేస్తారు. సుమన తీరు వేరు. మనిషి అందంగా , హుందాగా ఉంటుంది. ఎవరైనా తన సర్కిల్ లో వాళ్ళు సలహా అడిగితే ఎంతో ఆలోచించి అన్ని కోణాలనుండి ఆ సమస్యలోని సాధక బాధకాల గురించి పూర్తిగా విశ్లేషించి వివరించి చెప్పగల తెలివైనది.  నాకు తన వ్యక్తిత్వం చాలా విషయాలలో నచ్చుతుంది. ఒక్క విషయంలో తప్ప.  అబ్బ ఇంకా రాలేదేమిటా అని టైం చూస్తే ఒంటిగంట లంచ్ టైం అయ్యింది ఇంక ఎప్పటికి వస్తుంది సుమన ? కనీసం ఎదురుచూస్తూ ఉంటానని అనుకోదేం?  ఒక ఫోన్ చేసి లేట్ అవుతుందని చెబితే తన సొమ్మేం పోతుంది?

ఇంత గింజుకునే బదులు ఆ పనేదో నేనే చెయ్యొచ్చుగా అనేగా మీ ఉద్దేశం? అదే వస్తున్నాను. నాకు తనలో నచ్చని విషయం ఇదే . ఇప్పుడు నేను ఫోన్ చేసాననుకోండి "అయ్యో నేను  నీకు చెప్పినప్పటి నుంచి ఒకటే హడావిడిగా పనులు చేస్తూనే వున్నాను. ఇంకా కాలేదోయ్ ఏమీ అనుకోకు నేనే చేసి చెబుదామనుకున్నాను. హడావిడిలో మర్చిపోయాను . ఇందాక ఫోన్ దాకా వచ్చిన దాన్నే ఏదో గుర్తువచ్చి వెళ్లాను మళ్ళి కుదరలేదు. అందులోను నువ్వేకదా  నన్ను బాగా అర్ధం చేసుకున్నదానివి, ఇంక నా  సంగతి బాగా తెలిసిన దానివి కనుక మనిద్దరిమధ్య ఫార్మాలిటీస్ కి అంత ఇంపార్టెన్స్ లేదని, మర్చిపోయినా నువ్వేమీ అనుకోవని పరవాలేదులే" అని.............. అంటూ ముందరకాళ్ళకి బంధం వేసేస్తుంది మరి. ఇలాంటివి చాలా సార్లే అయ్యాయి లెండి. అందుకే ఈసారి మాత్రం ఎలాగైనా తను చేసి చెపితేనే వినాలి అని నేను పట్టుబట్టి కూర్చున్నాను.

సరే తనింకా రాలేదుగా అని ఎలాగో లంచ్ టైం అయ్యింది  కదాని భోజనం అయ్యిందనిపించానే కానీ ధ్యాసంతా సుమన మీదే . ఇన్ని మంచి క్వాలిటీస్ వున్న అమ్మాయి ప్రతిసారి ఇలానే ఎందుకు చేస్తుందా అని. వచ్చిన తరువాత మాత్రం ఇంక భూమ్మీద తను నిలబడదు, నన్ను నిలబడ నివ్వదు . అంత హడావిడి చేసేస్తుంది. ఈ లోపు ఎదురుచూడడం మాత్రం నేను ఎప్పుడు ఫేస్ చేసే పెద్ద బోరింగ్ ప్రోగ్రాం అనుకోండి. టైం 4 కాస్తోంది ఇంకేం వస్తుంది? ఒకవేళ ఫోన్ చేసినా ఇంక కుదరదు లేవోయ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళ్ళయ్యింది అంటుంది. అందుకని ఇంక నేను కూడా ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టి నా పిల్లలు వచ్చే వేళ్ళయ్యిందని లేచి వాళ్ళకు టిఫిన్ ఏర్పాట్లలో పడ్డాను.

తనంటే నాకు క్లోజ్ కనుక నిజంగానే మా మధ్య ఫార్మాలిటీస్ కి అంత ప్రాముఖ్యం లేదు కనుక సరిపోతోంది. ఇలా ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ గురించి అంత శ్రద్ధ చేయని వాళ్ళు చాలామందే వుంటారు. కానీ రిలేషన్స్ ని జగ్రత్తగా మెయింటైన్ చెయ్యాలంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలమీద శ్రద్ధ చాలా అవసరం. చిన్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెట్టడం వల్ల అవతల వ్యక్తి మీద మనకున్న కేర్ ని , అభిమానాన్ని వ్యక్తం చేసినవాళ్ళమవుతాము . వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ అనే భావన అవతలి వారిలో మనమీద పాజిటివ్ ఫీల్ ని నింపుతుంది . దాని వల్ల ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం మరింత బలపడుతుందనేది మాత్రం నిజం. ఇది కేవలం ఫ్రెండ్స్ వరకే కాదు తల్లిదండ్రులు – పిల్లలు, భార్య – భర్తలు, రిలేటివ్స్ఇలా ఎవరి మధ్యనైనా ఇటువంటి చిన్న కేర్ బంధాలను బలపరుస్తుందనేది నా అభిప్రాయం, నమ్మకం. మరి మీది?

1 కామెంట్‌: