22, సెప్టెంబర్ 2014, సోమవారం

గోవిందాశ్రిత గోకులబృందా అన్నమాచార్య




రచన: అన్నమాచార్య

గోవిందాశ్రిత గోకులబృందా |
పావన జయజయ పరమానంద ||


జగదభిరామ సహస్రనామ |
సుగుణధామ సంస్తుతనామ |
గగనశ్యామ ఘనరిపు భీమ |
అగణిత రఘువంశాంబుధి సోమ ||


జననుత చరణా శరణ్యు శరణా |
దనుజ హరణ లలిత స్వరణా |
అనఘ చరణాయత భూభరణా |
దినకర సన్నిభ దివ్యాభరణా ||


గరుడ తురంగా కారోత్తుంగా |
శరధి భంగా ఫణి శయనాంగా |
కరుణాపాంగా కమల సంగా |
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ||

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి అన్నమాచార్య కీర్తన







రచన: అన్నమాచార్య

రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి |
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ||


వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ |
తక్కినవి భాండారాన దాచి వుండనీ |
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము |
దిక్కై నన్నేలితి వీ  ఇక  నవి తీరని నా ధనమయ్యా ||


నా నాలికపైనుండి నానాసంకీర్తనలు |
పూని నాచే నిన్ను బొగడించితివి |
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ |
కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతేయయ్యా ||


యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని |
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను |
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ |
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ||

25, ఆగస్టు 2014, సోమవారం

దేవ దేవం భజే దివ్యప్రభావమ్ అన్నమాచార్య కీర్తన





రచన: అన్నమాచార్య

రాగం: ధన్నాసి

దేవ దేవం భజే దివ్యప్రభావమ్ |
రావణాసురవైరి రణపుంగవమ్
రామం ||

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయమ్ |
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రమ్ ||

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి-
శాలవక్షం విమల జలజనాభమ్ |
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనమ్ ||

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనమ్ |
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతమ్ ||

22, ఆగస్టు 2014, శుక్రవారం

అన్నమాచార్య కీర్తన నానాటి బతుకు నాటకము

చాలా రోజుల తరువాత పెడుతున్నానని అలిగి వినకుండా వదిలేయ్యకండి . మీకు పరిచయమున్న పాటే . కానీ M.S.సుబ్బలక్ష్మిగారు పాడారు. ఆవిడ పాడినపాట అంటే చెవిలో అమృతం పోసినట్టే కదా. మీరు కాదనరనుకోండి . మరి ఇంకెందుకు ఆలస్యం వినేయ్యండి .ఆఆ ఎలావుందో చెప్పడం మార్చిపోయే అంత మైమరచిపోకండి .

 

నానాటి బ్రతుకు నాటకము





రచన: అన్నమాచార్య

రాగం: ముఖారి

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ||


పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము |

యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ||


కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము |
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ||


తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ||

9, ఆగస్టు 2014, శనివారం

వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు


           



31, మార్చి 2014, సోమవారం

జయ నామ సంవత్సర శుభాకాంక్షలు

అందరికి జయ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యం, సిరి సంపదలు, సుఖాలు తో కూడిన తృప్తి కరమయిన జీవితం గడపాలని ఆశిస్తూ...

మా ఇంటిలోని మామిడి చెట్టు-1

మా ఇంటిలోని మామిడి చెట్టు-2

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

నీవై రావా

నీవై రావా

పువ్వులలో సౌందర్యం నీవై 
గాలిలో చల్లదనం నీవై 
మట్టిలో మకరందం నీవై
నా జీవితంలో ఆనందాల వెల్లువ నీవై
హరివిల్లులో రంగులన్నీ పండించగా రావా!

గాజుల గలగలలు నీవై
మువ్వల సవ్వడులు నీవై
పన్నీటి వెల్లువలు  నీవై
గంధం లో పరిమళాలు నీవై
ప్రవహించే ఆనందాలు అందించగా రావా!!

6, జనవరి 2014, సోమవారం

మానసిక స్తైర్యం

        

 మానసిక స్తైర్యం



            నిన్న టీవీ పెట్టిన దగ్గరనుంచి ఒకటే డల్ గా అనిపించింది. సిని నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య.  అసలు ఆత్మహత్య చేసుకోవాలంటే  ధైర్యం చాలా కావాలి. అంత ధైర్యం వాళ్ళకష్టాన్ని గట్టెక్కడానికి ఉపయోగించగలిగితే వాళ్ళు సాధించలేనిది ఏముంటుంది? చావాలని ఆలోచించే సమయాన్ని వాళ్ళు ప్రాబ్లం కు సొల్యూషన్ వెతకటం లో పెట్టగలిగితే సగం నిరాశావాదులు తగ్గుతారు.

          ఎంత కష్టం వచ్చినా దేనిమీదైనా విరక్తి కలగచ్చు కానీ , జీవితం మీద విరక్తి కలగకూడదు.  కాలంతో పాటు కొన్ని కష్టాలు అనుకున్నవి  చాలా సులువుగా తీసిపడేసే అంశాలుగా కనబడొచ్చు. అయిన ఆ మాత్రం జీవితం మీద అవగాహన లేనివాళ్ళు వాళ్ళ మీద ఆధారపడే వారిని ఎలా జాగ్రత్తగా చూసుకోగలరు? ఒక (చిన్న/పెద్ద) కష్టాన్ని తట్టుకోలేని , సాధించలేని మనస్తత్వాలు దేశానికి, సమాజానికి, కనీసం కుటుంబానికి ఎంతవరకు భరోసాగా వుండే అవకాశం ఉంటుంది? 
          
           చిన్నప్పటి నుంచి ఆటల నుంచి పిల్లల మనస్తత్వాలను ధైర్యంగా మలచగలిగే కుటుంబవ్యవస్థ కేవలం మన భారత దేశానికే సొంతం. అలాంటిది ఈ మధ్య యువతలో మానసిక స్తైర్యం సన్నగిల్లిపోవడానికి కారణాలను చూస్తే మనమే అనేది స్పష్టమవుతోంది .  పూర్వంలా ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడులేవు. అవి వుంటే కొంతలో కొంత పిల్లలకి తాత, మామ్మ / అమ్మమ్మ ల నుండి కొంత కౌన్సిలింగ్ లు జరిగే అవకాశం వుండేది. ఇంకోటి పిల్లలు నలుగురితో కలిసి ఆడుకోవడం, పోట్లాటలు తిరికి కలిసిపోవడాలు  లాంటి వాతావరణం ఈనాటి పిల్లలలో లేకపోవడం ఒక కారణంగా చెప్పొచ్చు.చిన్నప్పటి నుండి పక్క పిల్లలతో కలిసిమెలిసి తిరగడం వల్ల చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళు పరిస్తితులను ఎలా నెగ్గాలి అనే విత్తనం పడే అవకాశం ఉంటుంది. అలానే పూర్వం ఇంట్లో కనీసం ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండేవారు. అలా మిగతా వారితో కలిసి పెరగడం వల్ల ఒక వస్తువు మీద కేవలం ఒకరి హక్కే అనే భావన కాకుండా పంచుకోవడం, సర్దుకోవడం వంటివి ఉండేవి. ఇప్పటి ఇళ్ళల్లో కేవలం ఒక్క పిల్లో, పిల్లాడో ఉండడం వల్ల వారి బొమ్మలపై , అమ్మానాన్నల గారాలపై కేవలం వారి ఒక్కరి హక్కే ఉంటోంది. కాబట్టి షేరింగ్ , వెయిటింగ్ లాంటి విషయాల గురించి పిల్లలకి తెలిసే అవకాశం లేదనే చెప్పాలి.

     ఇంకో కారణం  ఇప్పటి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడం వల్ల టైం దొరకని కారణం వల్ల పిల్లలకు ఇన్స్టెంట్ ఫుడ్ లు, రడీమేడ్ డ్రెస్ లు, మాల్ల్స్ లో షాపింగ్ లు ఇవే పరిచయం చేస్తున్నారు.  వాటిలో రియాలిటీ కన్న  పిల్లలకు నాచురల్ కాక ఆర్టిఫిషియల్ విషయాలే కనబడుతున్నాయి.  మనిషికి అన్ని ఎంతో సులువుగా అందుతాయి అన్న అవగాహనే ఏర్పడుతోంది. దానితో తండ్రి కష్టపడితేనే ఈ సౌకర్యాలు అనే విషయం వైపు పిల్లలకి దృష్టి పడే అవకాశమే వుండడం లేదు. చిన్నప్పుడు మా అబ్బాయిని ఎవరైనా మీ నాన్నకి డబ్బులు ఎలా వస్తాయి అని అడిగితే వాడు ATM మిషిన్ లో కార్డు పెడితే వస్తాయి అనేవాడు. అదే వాడికి కనపడేది మరి. అది వాడి తప్పు కాదనుకోండి. ఆ పద్ధతి ఇప్పటి పిల్లలలో ఇంకా ముదిరిందనే చెప్పాలి. 

          ఇంక స్కూల్స్ లో ఐతే excursion కి తీసుకెళ్ళాలి అంటే ఏ రిసార్ట్ కో తీసుకేలుతున్నారే కానీ అందులో పిల్లలకు ఎంత వరకు ఉపయోగం అనేది ఆలోచించటం లేదనే చెప్పాలి. ఇప్పటి పెద్ద స్కూల్స్ ఐతే ఫారెన్ ట్రిప్స్ కూడా వేస్తున్నారు. పిల్లలకు అది అవసరమా అసలు.
         
            ప్రతి పిల్లాడి చేతిలో tablet / mobile వుంటోంది. ఎందుకురా నీకు అంటే ఆడుకోడానికి అంటాడు వాడు. ఇది వాళ్లంతట వాళ్ళకు వచ్చినది కాదుకదా.  స్కూల్ డేస్ లో చేతిలో సెల్ ఫోన్లు, కాలేజ్ డేస్ లో బైక్ లు , ఇంక రియల్ లైఫ్ గురించి ఆలోచించే సమయం ఇప్పటికితల్లితండ్రులు గా మనం ఎక్కడ ఇస్తున్నాము?

          ఇంక  సినిమాలలో ఐతే  హీరో అంటే మేలినియర్ కి వారసుడు ఓ వందమందిని చంపెస్తేనే వాడు మగాడు. ఆడపిల్లకి ఐతే వాడే సరైన మొగుడు . ఆ సినిమాలుచూస్తే పిల్లలకి పెద్దైన వెంటనే తేరగా ఆస్తులు వచ్చి పడతాయి అనుకుంటున్నారు. రాని పిల్లలకి తండ్రి చేతకానివాడుగా కనబడతాడే తప్ప వాడు పగటికలలలో వున్నాడని అర్ధం అయ్యే సరికి వాళ్ళకి ౩౦ ఏళ్ళు దాటిపోతున్నాయి. ఇంక ఆ టైం లో చేసి సాధించడం గురించి ఎప్పటికి ఆలోచించగలరు. 

          ఇలాంటి పెంపకాల వల్ల మనమే మన పిల్లల భవిష్యత్తును గాలిలో నిలబెడుతున్నామన్న నిజాన్ని తల్లితండ్రులు ముందుగా గ్రహించుకుంటే , పిల్లలకు వాళ్ళని వాళ్ళు ఎలా బాలన్స్ చేసుకోవాలో నేర్పగలిగిన వాళ్ళమవుతాము .