28, ఫిబ్రవరి 2013, గురువారం

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని అన్నమాచార్య కీర్తన





ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పాటండి తప్పక వినండి వీలయితే నేర్చుకుని పాడుకుని చూడండి నిజంగా చాలా ఆనందంగా వుంటుంది



రాగం: దేవగాంధారి

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ||


గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి |
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోవు  వాని వెడ్డు వెట్టరే ||


ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి |
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||


ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి |
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ||

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

జో అచ్యుతానంద జోజో ముకుందా అన్నమాచార్య కీర్తన




జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ||

  
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
అందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||


అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ||


హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||



 ఈ పాట లో చరణాలు ఇంకా వున్నాయండి అవి కూడా మీ కోసం ఇవిగో .



గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ||


పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ||


అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||


గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ||


రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ||


ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ||


అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ||



25, ఫిబ్రవరి 2013, సోమవారం

బ్రహ్మ కడిగిన పాదము అన్నమాచార్య కీర్తన

 


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||


చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||


కామిని పాపము డిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికేటి  పాదము
పామిడి తురగపు పాదము ||


పరమ యోగులకు పరి పరి విధముల
వరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అన్నమాచార్య కీర్తన



మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ||


జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ||


అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై |
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ||

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ అన్నమాచార్య కీర్తన

 

రాగం: వరాళి

డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ ||

మీనకూర్మ వరాహా మృగపతి‌అవతారా |
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ||


వామన రామ రామ వరకృష్ణ అవతారా |
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ||


దారుణ బుద్ద కలికి దశవిధ‌అవతారా |
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ || 2 ||

జగడపు చనువుల జాజర అన్నమాచార్య కీర్తన




జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ||



మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||



భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||



బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||

18, ఫిబ్రవరి 2013, సోమవారం

భావములోనా బాహ్యమునందును అన్నమాచార్య కీర్తన



రాగం: దేసాక్షి

భావములోనా బాహ్యమునందును |
గోవింద గోవిందయని కొలువవో మనసా ||



హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు |
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా ||



విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ||



అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ||

11, ఫిబ్రవరి 2013, సోమవారం

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు అన్నమాచార్య కీర్తన



 

రాగం: భూపాళం

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు |
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ||


అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి |
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి |
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి |
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి ||


కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి |
ఘనమైన దీపసంఘములు గంటి |
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి |
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి ||


అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి |
సరిలేని యభయ హస్తమ్ము గంటి |
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి |
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి ||

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

మూసిన ముత్యాల కేలే మొరగులు అన్నమాచార్య కీర్తన





మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ||


కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ||


భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||


ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి |
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ||

7, ఫిబ్రవరి 2013, గురువారం

అలరులు గురియగ నాడెనదే అన్నమాచార్య కీర్తన

 
రచన: అన్నమాచార్య కీర్తన 



రాగం: శంకరాభరణం

అలరులు గురియగ నాడెనదే |
అలకల గులుకుల నలమేలుమంగ ||


అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే |
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ||


మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే |
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ||


చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే |
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ ||

2, ఫిబ్రవరి 2013, శనివారం

సుమతీ శతకము

ఈ బంగారుతల్లిని చూడండి ఎంతముద్దుగా సుమతీ శతక పద్యాలనూ చేపుతోందో . మరీ గట్టిగా చూడకండి దిష్టి తగులుతుంది .



దాశరథి శతక పద్యము 1

దాశరథి  శతక పద్యము

చక్కగా రాగంతో వుంది చూడండి పిల్లలకు చూపిస్తే పద్యం నేర్చుకోవడం వాళ్ళకి సులువుగా వుంటుంది. అందులోను ఈ పద్యం వస్తే రాముని కీర్తించడం కూడా జరుగుతుంది.